ఢిల్లీ కాలనీల్లో నరకప్రాయ పరిస్థితులు

ఢిల్లీ కాలనీల్లో నరకప్రాయ పరిస్థితులు
  • ఆప్ సర్కార్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి: ఢిల్లీ ఎల్జీ సక్సెనా
  • ఎల్జీకి థ్యాంక్స్.. ఆయన గుర్తించిన లోపాలు సరిచేస్తున్నం: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదివారం ఢిల్లీలోని కొన్ని ఏరియాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు నరకప్రాయంగా ఉన్నాయంటూ పలు సమస్యలను ఎత్తి చూపారు. ఓపెన్ డ్రెయిన్ల్, అపరిశుభ్రత, నీళ్ల సరఫరా సరిగా లేదని, భారీ విద్యుత్ బిల్లుల గురించి తనకు ప్రజలు ఫిర్యాదు చేశారని చెప్పారు. దక్షిణ ఢిల్లీలోని రంగపురి, నైరుతి ఢిల్లీలోని కపషేరాలో ఎల్జీ పర్యటన కొనసాగింది.

ఆయన వెంట దక్షిణ ఢిల్లీ ఎంపీ రాంవీర్ సింగ్ బిధూరి, పలువురు అధికారులు ఉన్నారు. సోమవారం నుంచి సమస్యలపై స్పెషల్ డ్రైవ్ ఉంటుందని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. పనులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. ‘‘ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నరకప్రాయంగా ఉన్న పరిస్థితులను చూడాలని నేను కోరుతున్న. వారి పరిస్థితిని మెరుగుపరచడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలి. మనం కలిసి వచ్చి ఢిల్లీని మళ్లీ గొప్పగా తీర్చిదిద్దుదాం’’ అని ఎల్టీ తన ‘ఎక్స్’ ద్వారా పోస్ట్​ చేశారు.

ఎల్జీ ఇలాగే లోపాలు గుర్తించాలి: కేజ్రీవాల్​

ఎన్నికల ప్రచారంలో ఉన్న కేజ్రీవాల్​ను ఎల్జీ సక్సేనా సోషల్ మీడియా పోస్ట్ గురించి మీడియా ప్రశ్నించగా ‘‘లెఫ్టినెంట్ గవర్నర్‌‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన గుర్తించిన అన్ని లోపాలను మేము పరిష్కరిస్తం. ఆయన రోడ్లపై గుంతలను ఎత్తిచూపారు, మేము ఆ రోడ్డును బాగు చేస్తున్నాము, మిగతా ప్రాంతాలను శుభ్రం చేస్తం. ఆయన ఇలాగే లోపాలను ఎత్తి చూపాలని నేను కోరుతున్నాను” అని అన్నారు.

ఆదివారం మధ్యాహ్నం రంగపురిని సందర్శించిన సీఎం అతిషీ.. మీడియాతో మాట్లాడారు. ‘‘ఇక్కడి సమస్యలను మా దృష్టికి తెచ్చినందుకు ఎల్జీకి థ్యాంక్స్.. ఢిల్లీలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆయన తప్పనిసరిగా మాకు తెలియజేయాలి. కేజ్రీవాల్ మార్గదర్శకత్వంతో ఆప్ ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తుంది” అని ఆమె అన్నారు.